Source Credits: ABN ANDHRA JYOTHI TELUGU NEWS
Printed Date: 17-03-2023

మూడు రోజుల పాటు నాంపల్లి బాబా చిరునామా కోసం ఎదురు చూడడం ఒక యజ్ఞమే అయింది. ఈలోగా ఎన్నో ఆలోచనలు… ‘సాక్షాత్తూ షిరిడీ సాయిబాబా అవతారమైన నాంపల్లి బాబా తలచుకుంటే నా సమస్యలు తీరడం ఎంత పని? నా ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఆయనకోలెక్కా? ఏదో విధంగా నా ప్లాట్ ఖాళీ అవుతుంది’ అనుకున్నాను.
తరువాత…. గురువారం రోజు ఉదయం నుంచి నిముషాలు లెక్కపెడుతూ గడిపాను. పాఠాల బోధన ముగించుకొని, మధ్యాహ్నం ఇంటికి వచ్చాను. హడావిడిగా నా ప్రిపరేషన్ పూర్తి చేసుకొనేసరికి దాదాపు సాయంత్రం అయింది. నేను ఎంత త్వరపడినప్పటికీ… చీకటి పడిన తరువాతే… నాకు నాంపల్లి బాబా చిరునామా ఇస్తానన్న మహిళ నడిపే పాన్ దుకాణానికి చేరుకోగలిగాను ఆమెకు ‘నమస్కారాలు’ చెప్పాను.
ఆ వనిత నన్ను గుర్తుపట్టనట్టు ‘‘మీరెవరు? మీకేం కావాలి?’’ అని అడిగింది. నా ప్రాణం జివ్వుమంది.
‘‘ఆయనను ఎందుకు చూడాలి?’’ అని అడిగింది. నాకున్న సమస్యలన్నీ ఆమెతో ఏకరువు పెట్టుకున్నాను.
ఆమె ఇంకా సంకోచించింది. ‘‘నాంపల్లి బాబా ఇప్పుడు ఉంటున్న ప్రదేశంలో రెండు వర్గాల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. వాటిలో మనుషులు చచ్చిపోతూ ఉంటారు. రాత్రివేళ అక్కడికి వెళ్ళడం ప్రాణాపాయం. పగలు వెళ్ళండి’’ అంది. ‘‘నాకు నా ఉద్యోగం వల్ల పగలు వీలు కాదు’’ అని చెప్పాను.
‘‘అయితే ఆదివారం వెళ్ళండి’’ అంది.
గురు, శుక్ర, శని, ఆది… అన్ని రోజులు ఆగడమా? ‘‘ఈ రోజే వెళ్ళి తీరాల’’ని పట్టుపట్టాను.
కాసేపటి తరువాత… నాంపల్లి బాబా చిరునామా నాకు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. అయితే, నేను ఒక ఆటో రిక్షాలో వెళ్ళి, అదే ఆటోలో మళ్ళీ తిరిగి రావాలనే షరతు పెట్టింది. అంచేత నాకు కనీసం ఆటో డ్రైవర్ తోడుగా ఉంటాడు. అందుకు నేను ఒప్పుకున్నాను. ఆమె ఏర్పాటు చేసిన ఆటోలో ఓల్డ్ సిటీకి బయలుదేరాను.
నాంపల్లి, మొజమ్‌జాహీ మార్కెట్, అఫ్జల్‌గంజ్ మీదుగా… చార్మినార్ అవతలివైపు ఆటో వెళ్తోంది. దేవుడు దగ్గరకు వెళ్ళేటప్పుడు… స్తోత్రాలు చదువుకోవడం మంచిది. కనీసం భజనలైనా పాడుకోవాలి. కానీ ట్రాఫిక్‌లో బస్సులు, లారీల డీజిల్ పొగ, దుమ్ము వల్ల నాకు ఆ ఆలోచన రాలేదు. అఫ్జల్‌గంజ్‌లో దుకాణాల ముందు… నేల మీద ఎండు మిరపకాయలు, వెల్లుల్లి పాయలు గుట్టలుగా పోసి అమ్ముతారు. వాటి ఘాటుకు నాకు తుమ్ములు వచ్చాయి. ‘‘ఒక తుమ్ము కీడు, రెండు తుమ్ములు శుభం’’ అంటారు పెద్దలు. రెండు సార్లు తుమ్మిన తరువాత… నన్ను నేను నిగ్రహించుకోడానికి శతవిధాలా ప్రయత్నించాను. కానీ మూడోది బాంబులా పేలింది… కలహం. ఇక నా ముక్కు నా అదుపులో లేకపోవడంతో… లెక్కలేనన్ని సార్లు తుమ్మాను. ‘బాబా దర్శనం అవుతుందా? ఆయన ఉంటున్న ఇల్లు దొరుకుతుందా?’…
ఇవే ఆలోచనలు.
అరగంట తరువాత… ఆటో చార్మినార్ దాటి, గౌలిపురా అవతల ఇరుకైన గొందుల్లో స్లమ్ లాంటి పరిసరాల్లోకి మళ్ళింది.
‘‘అక్కడ ఎక్కడో గాంధీ విగ్రహం వస్తుంది. అది దాటాక రోడ్డు రెండుగా చీలుతుంది. ఎడమవైపు వీధి వెంట పోతే ఒక నీళ్ళ కొళాయి కనిపిస్తుంది…’’ అంటూ డ్రైవర్‌కు పాన్ దుకాణం వనిత చెబుతుంటే… నాకు ‘పాతాళభైరవి’ లాంటి సినిమాలు జ్ఞాపకం వచ్చాయి. గతుకుల రోడ్ల మీద చీకట్లో చాలా సేపు వెళ్ళాక… గాంధీ విగ్రహం కనిపించింది.
‘‘ఇక్కడే ఎక్కడో నీళ్ళ కొళాయి ఉండాలి’’ అంటూ ఆటో డ్రైవర్ చాలా సేపు ఆ గతుకుల సందుల్లో… చీకట్లో ఆటోని అటూ ఇటూ తిప్పాడు. నా అసహనం నిస్పృహగా మారుతున్న దశలో… నీళ్ల కొళాయి కనిపించింది. కొద్దిసేపటి తరువాత… ఆటో ఒక ఇరుకైన సందు మొదట్లో ఆగింది.
‘‘నాకు తెలుసు, నాంపల్లి బాబా ఎక్కడ ఉంటాడో’’ అంటూ ఒక చిన్న పిల్లవాడు నాకు దారి చూపాడు.
సందు చివర ఒక ఇంటి గదిలోంచి ట్యూబ్‌లైట్ కాంతి వీధిలో కొద్దిగా పడుతోంది. ‘‘బాబా ఆ గదిలో ఉంటాడు’’ అంటూ ఆ పిల్లవాడు మాయమైపోయాడు. నేను బయట చెప్పులు వదిలిపెట్టి, వేగంగా కొట్టుకుంటున్న గుండెతో… అరుగు మెట్లు ఎక్కాను. ఆ గది తలుపు తెరిచి, లోపలికి చూస్తే… నాకు నోట మాట రాలేదు.
– గుంటూరు వనమాలి
(సుప్రసిద్ధ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ కుమారుడు. కవి, రచయిత.
ప్రస్తుతం జర్మనీలో అధ్యాపకునిగా ఉన్నారు.)