శ్రీ నాంపల్లి బాబా వారు సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయినాధుని అవతారమూర్తియే. పోలీస్ స్టేషన్ వరండాలో బాబా వారు

Share with World

Source Credits: ABN ANDHRA JYOTHI TELUGU NEWS

Printed Date: 10-03-2023

నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు నాంపల్లి బాబాతో పరిచయం ఏర్పడింది. నా జీవితం నేను అనుకున్న విధంగా, ఎలాంటి విఘ్నాలూ లేకుంగా గడచిపోయి ఉంటే… నేను ఆయన గురించి ఏమాత్రం ఆలోచించేవాణ్ణి కాదు. నేను జర్మనీలో ఏడాది పాటు జర్మన్‌ భాష నేర్చుకున్నాను. మ్యూనిచ్‌లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాను. శిక్షణ పూర్తయిన రెండోరోజే… నాకు టీచర్‌ ఉద్యోగం ఖాయం చేస్తున్నట్టు హైదరాబాద్‌ మాక్స్‌ముల్లర్‌ భవన్‌ అధికారులు వార్త పంపారు. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. కొన్ని ముఖ్యమైన జర్మన్‌ నవలలను తెలుగులోకి అనువదించాలి. ఎడ్మండ్‌ హుస్సర్ల్‌ అనే తత్త్వవేత్త మీద ఒక పరిశోధన గ్రంథం రాయాలి. ‘శ్రీసాయి సచ్చరిత్ర’ను జర్మన్‌లోకి అనువదించాలి (ఇది నా మొక్కుబడి). అన్నిటికన్నా ముఖ్యంగా… నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని, హైదరాబాద్‌లోని నా సొంత ప్లాట్‌లో జీవితాన్ని సుఖంగా గడపాలి. నేను వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఇన్నీ కావు. అదుపులోలేని ఉత్సాహంతో ఆఘమేఘాలమీద తేలుతూ వచ్చి, హైదరాబాదులో విమానం దిగాను. సరిగ్గా అదే క్షణంలో ఊహిచని సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. నా ఆశల్ని భంగపరిచాయి. హైదారాబాద్‌కు వచ్చిన రెండో రోజే… ఉద్యోగంలో చేరి, పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఏడాది శిక్షణ తీసుకున్నా… ఆ భాష కొత్తది.

బోధించడం చాలా ప్రయాసగా ఉండేది. గంట పాఠం చెప్పడానికి నాలుగు గంటల సన్నద్ధత అవసరం అయ్యేది. దానికి తోడు నా సహోద్యోగుల అసూయ, తద్వారా స్కూల్‌లో తలెత్తిన సమస్యలు, ఘర్షణలు! నేను జర్మనీలో ఉన్నప్పుడు… హైదరాబాద్‌లో నా తల్లితండ్రులు ఇల్లు మారారు. ఆ కొత్త ఇంటి పరిసరాల్లో ఎక్కడలేని జనసమ్మర్థం, బస్సులు, కార్ల రద్దీ, హారన్ల మోతలు, డీజిల్‌ పొగ, ఏప్రిల్‌ మండుటెండలు. ఆ ఇంటిని చూడగానే నా ప్రాణం బేజారెత్తింది. అక్కడ నేను నా పాఠాలకు ఎలా ప్రిపేర్‌ కావాలి?

సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌లోని నా ప్లాట్‌ని స్వాధీనం చేసుకొని, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, జర్మనీకి విమానం టిక్కెట్‌ పంపుతానని నా స్నేహితురాలికి వాగ్దానం చేశాను. ఆమె పెట్టాబేడా సర్దుకొని, టిక్కెట్టు కోసం జర్మనీలో ఎదురు చూస్తోంది. నా ప్లాట్‌లో కిరాయికి ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేసి, నాకు ప్లాట్‌ కావాలని చెప్పాను. అతనొక ఇన్స్యూరెన్స్‌ కంపెనీ ఛైర్మన్‌. ‘‘ఖాళీ చేయలేను’’ అన్నాడు. నా ఇంట్లో చేరేటప్పుడు మాత్రం అతి వినయంగా ‘‘మీకు మీ ఇల్లు కావాలనుకున్నప్పుడు చెప్పండి. వెంటనే ఖాళీ చేసి పోతాను’’ అని ప్రామిస్‌ చేశాడు. ‘‘వారం రోజులు గడువు చాలన్నావు కదా?’’ అని నిలదీసి అడిగాను.

జవాబు చెప్పకుండా ఫోన్‌ పెట్టేశాడు. నాకు గుండెపోటు వచ్చినంత పనయింది. ఒక లాయరు నా లీజ్‌ కాంట్రాక్ట్‌ పరిశీలించి, ‘‘మీరు మోసపోయారు. కోర్టు కేసుతో సాధించేదేం లేదు’’ అని నిర్ధారించాడు. అద్దె ఇంట్లో ఒక విదేశీ మహిళతో కాపురం పెట్టడం నాకు సుతరామూ ఇష్టం లేదు. అన్ని సమస్యలకూ నా ఇల్లే విరుగుడు. ఆ ఇంటిని ఎలా స్వాధీనం చేసుకోవాలి?

నా స్నేహితులందరితో సంప్రతింపులు మొదలుపెట్టాను. వాళ్ళకు ప్రభుత్వ అధికారులతో, కాంట్రాక్టర్లతో, సిబిఐ అధికారులతో పరిచయాలు ఉండేవి. వాళ్ళలో కొందరు జర్నలిస్టులు. ఒక బాల్య మిత్రుడు పహిల్వాను. ఇళ్ళ స్థలాల గొడవల్ని పరిష్కరించడం ఇప్పుడు అతని వృత్తి అని తెలిసింది. అయితే ‘గూండాల సాయంతో ఖాళీ చేయించిన ఇంట్లో కాపురం పెట్టడం సబబేనా?’ అనే సంశయంతో వెనుకాడాను. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు నా బోధన మొదలై, మధ్యాహ్నం పన్నెండుకు ముగిసేది. ఎండలో స్కూటర్‌ మీద ఇంటికి వచ్చి, భోజనం చేసి, అలసటతో నడుం వాల్చేవాణ్ణి. వెంటనే గాఢంగా నిద్రపట్టేది. గంట తరువాత లేచి, నాలుగు గంటల సేపు మరుసటి రోజు పాఠాల ప్రిపరేషన్‌ చేసుకొనేవాణ్ణి.

సాయంత్రం చీకటి పడ్డాక, ప్రెస్‌ క్లబ్‌లో నా స్నేహితులను కలిసి, కాలక్షేపం చేసేవాణ్ణి. వాళ్ళు నా సమస్య గురించి సానుభూతిగా ఆలోచించేవాళ్ళు. ఒక రోజు సాయంత్రం నా మిత్రుడు దివాకర్‌ నాకు ప్రఖ్యాత రచయిత బీనాదేవిని పరిచయం చేస్తాను అన్నాడు. బీనాదేవి రచయిత మాత్రమే కాదు, జడ్జి కూడా. ఆయనతో పరిచయం నాకు మేలు చేయవచ్చని వెంటనే అంగీకరించాను. మర్నాడు సాయంత్రం జూబ్లీహిల్స్‌లో ఉన్న బీనాదేవి ఇంటికి వెళ్ళాను. బాబాలు, అవధూతలు, దైవిక శక్తులు తదితర అంశాల గురించి అనుకోకుండా చర్చించాం. నేను ‘శ్రీసాయి సచ్చరిత్ర’ను జర్మన్‌ భాషలోకి తర్జుమా చేసే ప్రయత్నంలో ఉన్నానని చెప్పాను. అప్పుడు తెలిసింది… బీనాదేవి… శిరిడీబాబా భక్తుడని.

మాకు తన ఇంట్లో ఉన్న పెద్దపెద్ద శిరిడీ సాయి బాబా రంగుల ఫొటోలు చూపించారు. శిరిడీ బాబా వల్ల తనకు కలిగిన అద్భుతమైన అనుభవాలను చెప్పారు. ఒకసారి రైల్లో ఆయనకు ‘‘వెంటనే రైలు దిగి చివరి బోగీలో ఎక్కు’’ అని శిరిడీ బాబా ఆదేశం వినిపించింది. రెండో స్టేషన్లో ఆయన భారీగా ఉన్న తన సామాన్లతో దిగి, చివరి బోగీలోకి ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ రైలు కదిలింది.

అయిదు నిమిషాల తరువాత… ఆ రైలు మరో రైలుతో ఢీకొంది. ముందు బోగీల్లో కూర్చున్న చాలామంది చనిపోయారు. బీనాదేవి చిన్న గాయాలతో బయటపడ్డారట! తనలో మేలుకుంటున్న దివ్య శక్తుల గురించి ఆయన చెబుతూ, మాటల మధ్యలో ‘‘మీరు శిరిడీ బాబా భక్తులైతే, ఆయన అవతారాన్ని తప్పకుండా దర్శించాలి’’ అన్నారు. దివాకర్‌కూ, నాకూ అది అర్థం కాలేదు. ‘‘పుట్టపర్తిలోని సత్యసాయిబాబానా?’’ అని అడిగాం. ‘‘కాదు ఇక్కడే హైదరాబాద్‌లో’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఎక్కడ? నేను ఆయనను వెంటనే దర్శించాలి’’ అన్నాను ఆత్రుతగా. ‘‘ఆ బాబారాత్రింబవళ్ళు హైదరాబాద్‌ నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ వరండాలో కూర్చొని ఉంటారు. అక్కడే దర్శనం చేసుకోవచ్చు’’ అని చెప్పారు.

అప్పుడు సమయం రాత్రి పదిన్నర దాటింది. అయినా నేను ఆ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకు దివాకర్‌ కూడా సమ్మతించాడు. ఇద్దరం బీనాదేవికి వీడ్కోలు చెప్పి, స్కూటర్‌ ఎక్కి బయలుదేరాం. తన ఇంటి గేటు దగ్గర నిలబడిన బీనాదేవి ‘‘ఆయనను అందరూ ‘నాంపల్లి బాబా’ అంటారు’’ అన్నారు బిగ్గరగా.

పదిహేను నిమిషాల తరువాత… మేమిద్దరం నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ వరండా ముందు స్కూటర్‌ దిగి నిలబడ్డాం. పోలీస్‌ స్టేషన్‌ వరండా ఖాళీగా ఉంది. అక్కడ నాంపల్లి బాబా కాదు కదా, పోలీసులు కూడా కనిపించలేదు. ఎంత సేపు చూసినా ఏ ఒక్కరూ లోపలి గదుల్లోంచి బయటకు రాలేదు. చాలా నిరాశ కలిగింది. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న షాపుల్లో కొన్ని ఇంకా తెరిచి ఉన్నాయి. వాటిలో నాంపల్లి బాబా గురించి వాకబు చేయసాగాము. సూట్‌ కేసులు, పెట్టెలు, సంచులు అమ్మే ఒక చిన్న దుకాణంలో కూర్చున్న వ్యక్తిని … నాంపల్లి బాబా ఎక్కడున్నారో చెప్పాలని అడిగాం. అతనికి చాలా కోపం వచ్చింది. ‘‘పధ్నాలుగు సంవత్సరాలపాటు రాత్రి, పగలు ఆ వరండాలో కూర్చొని ఉండేవాడు. ఆయనను చూసేందుకు ఈ రోజు దయచేశారేమిటి?’’ అన్నాడు వెటకారంగా.

‘‘ఆయన ఇప్పుడెక్కడ ఉన్నారు’’ అని అడిగాను.

‘‘ఎక్కడుంటాడు? దొంగ వెధవలు కిడ్నాప్‌ చేశారు. ఆ విషయం నన్ను అడగొద్దు, పోండి ఇక్కణ్ణించి’’ అన్నాడు ఎంతో అమర్యాదగా.

కొన్ని దుకాణాల అవతల… ఒక పాన్‌ డబ్బాలో మధ్యవయస్కురాలైన మహిళ కూర్చొని ఉంది. ‘‘అవును. నాంపల్లి బాబా కొన్ని సంవత్సరాలుగా ఆ పోలీస్‌ స్టేషన్‌ వరండాలో ఉండేవాడు. ఇప్పుడు అక్కడ ఉండడం లేదు’’ అంది. మెల్లగా ఆమెతో సంభాషణలోకి దిగాం. ‘‘ఆయనకు ఏవైనా మహిమలు ఉండేవా?’’ అని అడిగాం. 

‘‘సార్‌. ఆయన దేవుడి అవతారం. ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకు అది ప్రసాదించేవాడు’’ అంది.

‘‘ఏం కోరుకొనేవాళ్ళు?’’

‘‘ఉద్యోగాలు, ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, కేన్సర్‌ వ్యాధికి చికిత్స… ఇలా ఒకటని కాదు.’’

‘‘అంటే ఇక్కడికి చాలామంది వచ్చేవారేమో?’’

‘‘అవును. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఆఫీసర్లు, మూమూలు మనుషులు… ఇలా ఎవరెవరో వచ్చేవారు.’’

‘‘మరి ఆయన ఇక్కడ లేడేం?’’

‘‘సార్‌! రెండు వర్గాల మధ్య తగవులాటలు మొదలయ్యాయి. ఒక వర్గం వాళ్ళు ఆయనకు బొట్టు పెట్టి హారతి ఇవ్వనిచ్చేవారు కాదు. వాళ్ళ దృష్టిలో బాబా ఒక ముర్షద్‌. నిజానికి ఆయన దత్తాత్రేయుల వారి అవతారం. మరి మరో వర్గం వారు ఊరుకుంటారా?’’ అంది.

‘‘మరి తను దత్తాత్రేయుడి అవతారాన్నని అవతలి వర్గం వారికి ఆయన చెబితే సరిపోయేది కదా?’’

‘‘బాబా భక్తులతో కలలో తప్ప మాట్లాడడు.’’

‘‘ఈ తతంగం అంతా పోలీస్‌ స్టేషన్‌ వరండాలో జరుగుతూ ఉంటే పోలీసులు పట్టించుకొనేవారు కాదా?’’

‘‘సార్‌! పోలీసులు ఆయనకు భక్తులు అయిపోయారు. కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు బాబాను అక్కడి నుంచి తరిమేయాలనుకున్నారు. కానీ ఈలోగా వారికి బదిలీ అయిపోయేది.’’

‘‘మరి ఆయన ఎక్కడున్నారు?’’

‘‘క్రమేణా ఒక వర్గం బెడద తట్టుకోవడం కష్టమైపోయింది. మరో వర్గం భక్తుడు ఆయనను ఆటోలో తన ఇంటికి తీసుకుపోయాడు.’’

‘‘అదన్నమాట అసలు కథ. అందుకే ఆ సూట్‌ కేసుల షాపు యజమాని నాతో అంత అమర్యాదగా మాట్లాడాడు. నాకు నాంపల్లి బాబా ఎక్కడుంటున్నాడో చెప్పు. నేను ఆయనను చూసి తీరాలి’’ అన్నాను.

‘‘ఆయన చార్మినార్‌ అవతల ఓల్డ్‌ సిటీలో ఉంటున్నాడు. అడ్రస్‌ నా దగ్గర లేదు. గురువారం మళ్ళీ రండి. అప్పుడు ఇస్తాను’’ అందామె.

రాత్రి పన్నెండు కాబోతోంది. ఇక నాంపల్లి బాబాను దర్శించే ఆలోచన మానుకొని, మేము నిరాశతో ఇళ్ళకు వెళ్ళిపోయాం.

-గుంటూరు వనమాలి

(సుప్రసిద్ధ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ కుమారుడు. కవి, రచయిత. ప్రస్తుతం జర్మనీలో అధ్యాపకునిగా ఉన్నారు.)

Click Here To Read Previous Articles about Sri Nampally Baba in Andhra Jyothy Paper / ఆంధ్రజ్యోతి పేపర్‌లో శ్రీ నాంపల్లి బాబా గురించి మునుపటి కథనాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


Share with World

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *