Source Credits: ABN ANDHRA JYOTHI TELUGU NEWS
Printed Date: 24-03-2023
చాకిరేవుల్లో వస్త్రాల్ని ఉతికే బండమీద షిరిడీబాబా కూర్చుంటే… అది ఆయన ఆసనంగా మారింది. దాదాపు ప్రతి చిత్రంలో ఆయన ఆ రాయి మీద కూర్చొని కనిపిస్తాడు. లేదా సమాధి మందిరంలో వెండి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తాడు. అలాంటిదే ఏదో ఆసనం మీద నాంపల్లి బాబాను చూడబోతున్నానని అనుకున్నాను. తలమీద రుమాలు, కిరీటం లాంటివి… నా ప్రమేయం లేకుండానే నా ఊహా చిత్రంలో చోటు చేసుకున్నాయి. కానీ ఆ గదిలో నేలమీద పరచిన చాప మీద కూర్చున్న, బికారిలా కనిపిస్తున్న, బక్కచిక్కిన యాభై ఏళ్ళ వ్యక్తిలో నాకు లేశమైనా షిరిడీ బాబా పోలికలు కనబడలేదు. అతను చామనచాయలో ఉన్నాడు. కటి ప్రదేశాన్ని కప్పుతున్న చవకరకం దుప్పటి తప్ప… వేరే ఆచ్ఛాదన లేదు.
తైలసంస్కారం లేని జుట్టు చాలావరకూ నల్లగా ఉంది. పూర్తిగా నెరసిన గడ్డాన్ని అప్పుడప్పుడు మునివేళ్ళతో పీకుతున్నాడు. తన ఎదురుగా… గోడకు ఆనుకొని కూర్చున్న భక్తులను పట్టించుకోకుండా… దిక్కులు చూస్తూ, ఏదో గొణుగుతూ, అదమాయిస్తూ, భయపెడుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ పరిసరాల్లో మూత్రం వాసవ వస్తోంది. హైదరాబాద్ రోడ్ల మీద కనిపించే వందల మంది బిచ్చగాళ్ళకీ, అతనికీ పెద్ద తేడా నాకు కనిపించలేదు.
నేను క్రోధంతో… లోపలికి అడుగుపెట్టకుండా, తలుపు మూసి, వీధిలోకి పరుగెత్తాను. ‘షిరిడీబాబా అవతారం. తప్పకుండా దర్శించండి’ అని నాలో ఆశలను రగిలించిన బీనాదేవినీ, ఆ బికారి మహిమలను రకరకాలుగా కథలు చెప్పి, నాలో ఆశల్ని రెచ్చగొట్టిన పాన్ దుకాణం మహిళనీ బాగా తిట్టుకుంటూ… ఏం చేయాలో తెలియక వీధిలో నిలబడ్డాను.
‘‘సార్! ఇంత దూరం వచ్చి, బాబా దర్శనం చేసుకోకుండా బయట నిలుచుంటారేమిటి? నాతో రండి, నేను మిమ్మల్ని లోపలకు తీసుకువెళ్తాను’’ అంటూ ఆటోడ్రైవర్ వచ్చి, నన్ను గదిలోకి తీసుకువెళ్ళాడు. నేను మారుమాట్లాడకుండా గదిలోకి వెళ్ళాను. డైవ్రర్‌తో పాటు… ఇతర భక్తుల మధ్య గోడకు ఆనుకొని కూర్చున్నాను.
ఆ బికారి అదే ధోరణిలో, అర్థంకాని భాషలో… ఎవరో అదృశ్య వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళను బెదిరిస్తూ, బుజ్జగిస్తూ ఏవేవో ఆజ్ఞలు ఇస్తూ, చాప మీద కూర్చొని ఉన్నాడు. అక్కడున్న అయిదారుగురు మనుషులు… నిస్సందేహంగా పామరులు. ఆయన ప్రతి కదలికనూ భక్తిశ్రద్ధలతో గమనిస్తున్నారు. ఒక యువకుడు ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ‘‘బాబా! నా కోర్కె తీర్చు సాహెబ్!’’ అని ప్రాధేయపడుతూ, ఆయన దృష్టిని తనవైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నాడు. బాబా అతణ్ణి పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతున్నాడు.
‘‘నా కోరిక తీరిస్తే నీకేమిటి నష్టం. కోరిక తీర్చు, సాహెబ్’’ అంటూ ఆ యువకుడు బాబా మీదకు వెళ్ళాడు. బాబా గడ్డాన్ని తన వేళ్ళతో స్పృశిస్తూ బతిమాలాడు. బాబా క్షణం సేపు ఆ యువకుణ్ణి చూసి, మళ్ళీ అదృశ్య వ్యక్తులతో సంభాషణ కొనసాగించాడు. కొంతసేపటి తరువాత, హఠాత్తుగా… తల నుంచి కాళ్ళ వరకూ దుప్పటితో ముసుగు వేసుకొని చాపమీద పడుకున్నాడు. అప్పుడు తెలిసింది నాకు… ఆయనకు ఎడమకాలు మాత్రమే ఉందనీ, కుడికాలు లేదనీ!
ఆ యువకుడు నిరాశగా గదిలోంచి నిష్క్రమించాడు. అలా ఒక అరగంట నడిచింది. బాబా గొణుగుడు, నవ్వులూ క్రమంగా విజృంభించాయి. ఆయన హటాత్తుగా లేచి కూర్చున్నాడు. మళ్ళీ అదే ధోరణి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ భాషలో? అది తెలుగు కాదు, కన్నడం, తమిళం, మరాఠీ, ఉర్దూ… ఏదీ కాదు.
ఇంతలో ఒక అడ్డపంచ కట్టుకున్న మధ్యవయస్కుడు టీ కప్పులతో ఆ గదిలోకి వచ్చాడు. అతను ఆ ఇంటి యజమాని శ్రవణ్ కుమార్. చదువు సంధ్యలతో ఎలాంటి సంబంధం లేని ఒక సామాన్యుడు. ‘‘బాబా చాయ్ తాగు’’ అంటూ ఆయన ముందు నిలబడ్డాడు. బాబా అతణ్ణి చూడకుండా తన ధోరణిలో ఉన్నాడు. చివరకు కప్పును తన చేతిలోకి తీసుకొని, పదే పదే నా వైపు చూస్తూ, టీ తాగి… గట్టిగా నవ్వాడు.