ఆ ఆగంతకుడు బాబా ముందు చేతులు కట్టుకొని, ఆర్తితో ప్రార్థిస్తూ, చాలా సేపు అలాగే నిలబడ్డాడు. కొంతసేపటి తరువాత… బాబాకు నమస్కరించి, సెలవు తీసుకొని, బయటకు నడిచాడు. నేను అతని వెంట వెళ్ళాను. వీధిలో అతణ్ణి పరామర్శించాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అతని వివరాలు తెలుసుకున్నాను. అతని పేరు రామకృష్ణ. ఒక స్కూలుకి హెడ్మాస్టర్. స్నేహశీలి.
‘‘నేనొక ప్రశ్న అడగవచ్చా?’’ అన్నాను.
‘‘ఏదైనా అడగాలనుకుంటే అడగండి’’ అన్నాడు నన్ను సానుభూతిగా చూస్తూ.
‘‘మీకు ఈయన ఎలా తెలుసు? ఎంతకాలంగా తెలుసు?’’ అని అడిగాను.
‘‘చాలా సంవత్సరాల కిందట ఆయన మలక్‌పేట శ్మశానంలో ఉంటూ, ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉండేవారు. రాత్రి పగలు, ఎండ వర్షం లెక్క చెయ్యకండా వీధుల్లో తిరిగేవారు. ఎవరైనా చిల్లర డబ్బు ఇస్తే… దాన్ని మునివేళ్ళతో తీసుకువెళ్ళి, పాన్ దుకాణంలో ఇచ్చి, సిగరెట్లు కొనుక్కొనేవారు. నేనూ మలక్‌పేటలో ఉండేవాణ్ణి. ఆయన మా ఇంటికి ఎప్పుడైనా వస్తే… నా భార్య పెట్టే భిక్షను ప్రేమగా తినేవారు.’’
‘‘ఆయనకు కాలు ఒక్కటే ఉందేమిటి?’’
‘‘ఆయన ఆజానుబాహుడు. ఒక రోజు హఠాత్తుగా మాయమైపోయాడు. చాలాకాలం ఎవరికీ కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత భక్తులకు మళ్ళీ దర్శనం ఇచ్చినప్పుడు… ఆయనకు ఒక్క కాలు మాత్రమే ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిందో, కాలు ఎలా పోయిందో ఎవరికీ తెలీదు. ఆయన దయతో మా అబ్బాయి ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. బాగా వృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు పెద్ద ఆపదలో ఉన్నాడు. మమ్మల్ని ఆయనే రక్షించాలి’’ అని చెప్పాడు
‘‘ఆయన శిరిడీ సాయిబాబా అవతారం అంటారు. నిజమేనా?’’ అని అడిగాను.
రామకృష్ణ నన్ను కన్నార్పకుండా చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆయన ‘‘అవును’’ అని ఉంటే… నేను మరో ప్రశ్న అడిగేవాణ్ణి కాదు. వెంటనే గదిలోకి పరిగెత్తి, బాబా ముందు నిరాహారదీక్ష చేసేవాణ్ణి. నా కోరికలు తీరాకనే మళ్ళీ ఆ గదిలోంచి బయటకు వచ్చేవాణ్ణి.
అయితే… రామకృష్ణ ఏమాత్రం తడబడకుండా ‘‘ఆ విషయం నాకు తెలీదు’’ అన్నాడు.
రామకృష్ణ చెప్పిన జవాబు నుంచి తేరుకొని… ముఖ్యమైన నా రెండో ప్రశ్న వేశాను, ‘‘ఈయనకి మహిమలేవైనా ఉన్నాయా?’’ అని.
‘‘ఆయన మనకు ఎలాంటి మహిమలూ చూపరు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. ఆయన మనకు ఒక పెద్ద రక్ష. ఆయన అండ ఉంటే మనకెలాంటి హానీ జరగదు. అంతే… అంతకుమించి ఏవీ ఆశించవద్దు’’ అంటూ రామకృష్ణ సెలవు తీసుకున్నాడు.
నాంపల్లి బాబా ఒక పెద్ద రక్ష.. అంతేనా? అంతకుమించి మరేదీ లేదా? నా గుండెల్లో రాయి పడింది. రక్షణ ఎందుకు? దేని నుంచి రక్షణ? ఆయన ఏదో ఒక మహిమ ప్రయోగించి… నా కిరాయిదారుణ్ణి వెళ్ళగొడితేనే నాకు సహాయం జరుగుతుంది. అదొక్కటే నా ఆశ. ‘రామకృష్ణకు నిజం చెప్పే ధైర్యం లేదేమో?’ అనే సందేహం నాకు కలిగింది. ‘‘ఈ రేకుల ఇంట్లో కూర్చున్న ఫకీరు నిజంగానే శిరిడీ సాయిబాబా అవతారం. అవును. ఆయనకు మహిమలు ఉన్నాయి’’ అనో… లేదా ‘‘కాదు. ఇతను శిరిడీ బాబా అవతారం కాదు. ఇతనికి ఎలాంటి మహిమలూ లేవు’’ అనో… ఏదో ఒక స్పష్టమైన జవాబు ఇవ్వవచ్చు కదా! ‘అవును’, ‘కాదు’ అనే రెండు పదాలలో ఎంత నిజాయితీ ఉంటుంది! రామకృష్ణ జవాబులు గోడమీద పిల్లిలా ఉన్నాయి.
‘నాంపల్లి బాబాకు ఏవో శక్తులు ఉన్నాయి. కానీ ఆయన వాటిని నీకు చూపించడు. నువ్వు నీ కష్టాల్లోంచీ బయటపడవు. నీ సమస్యలు తీరవు. కానీ నీకు ఆయన రక్షణ మాత్రం ఉంటుంది!’- ఇదీ జవాబు. ఏమిటి ఈ వెర్రి?
కానీ గదిలో కూర్చున్న పామరులు మాత్రమే ఈ ఫకీరు భక్తులు కారు. రామకృష్ణ లాంటి ఒక విద్యావంతుడైన స్కూల్ హెడ్మాస్టర్ కూడా ఆయనకు పరమభక్తుడు. అయితే… ఎంతటి విద్యావంతుడైనా ఏదో ఒక పిచ్చికీ, భ్రమకూ గురయ్యే ప్రమాదం లేకపోలేదు.
రకరకాల సందేహాలతో నేను మళ్ళీ గదిలోకి వెళ్ళి, ఆ ఫకీరును చూస్తూ కూర్చున్నాను. ఈయన షిరిడీ బాబా అవతారమా? ఈయనకు మహిమలు ఉన్నాయా?
బాబా నన్ను… నన్ను అంటే నన్ను కాదు… నా పక్కన ఉన్న ఎవర్నో దీక్షగా చూస్తూ, ఏదో గొణుక్కుంటున్నాడు.