
Source Credits: ABN ANDHRA JYOTHI TELUGU NEWS
Printed Date: 07-04-2023
శ్రవణకుమార్ వచ్చి నా ఎదుట నిలబడ్డాడు. ‘‘ఆ హెడ్‌మాస్టర్‌తో బాబా గురించి మాట్లాడారట కదా! ఆయనను అన్నీ అడిగారా? వేయాలనుకున్న ప్రశ్నలన్నీ వేశారా?’’ అన్నాడు నన్ను కోపంగా చూస్తూ. నేను మౌనంగా ఊరుకున్నాను.శ్రవణకుమార్ వచ్చి నా ఎదుట నిలబడ్డాడు. ‘‘ఆ హెడ్‌మాస్టర్‌తో బాబా గురించి మాట్లాడారట కదా! ఆయనను అన్నీ అడిగారా? వేయాలనుకున్న ప్రశ్నలన్నీ వేశారా?’’ అన్నాడు నన్ను కోపంగా చూస్తూ. నేను మౌనంగా ఊరుకున్నాను.
‘‘బాబా దేవుడు. ఆయన గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. నాకు ప్రచారం ఏమాత్రం పనికిరాదు. మీరు కోరుకున్నప్పుడు వచ్చి ఆయన దర్శనం చేసుకోండి. ఇరవై నాలుగు గంటలూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. మీ పని అయిపోతుంది. దానికి నేను గ్యారెంటీ ఇస్తాను’’ అన్నాడు.
ప్రశ్నలనూ, సందేహాలనూ, కుతూహలాన్నీ సహించలేని శ్రవణకుమార్ మూఢభక్తి నాకు జుగుప్స కలిగించింది.
‘‘మీరు బాబాను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారా?’’ అనే ప్రశ్నను అడగాలనుకొని, మానేశాను.
అయితే దాని గురించి అతనే మాట్లాడుతూ ‘‘నాంపల్లి స్టేషన్‌లో బాబాను భక్తితో కొలుచుకోవడానికి వీలు ఉండేది కాదు. అందుకే ఆయనను మా ఇంటికి తీసుకువచ్చాను. అంతా ఆయన కోరిక ప్రకారమే జరిగింది. దుష్ప్రచారాలను నమ్మవద్దు’’ అంటూ పక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
కొద్దిసేపు గడిచాక… బాబా చాపమీద పడుక్కొని ముసుగు వేసుకున్నాడు. గదిలో మిగిలిన ఇద్దరు భక్తులు బాబాకు నమస్కారం చేసి, వెళ్ళిపోయారు. ‘ఇక మనం కూడా పోదాం’ అంటూ ఆటోడ్రైవర్ నాకు సైగలు చేశాడు. ఇద్దరం బయటకు వచ్చాం. ఆటో ఎక్కి, నాంపల్లి వైపు బయలుదేరాం. ఆ రోజు ఆటో రిక్షాలో ఆదుర్దాగా నాంపల్లి బాబా ఇంటి కోసం చీకట్లో వెతకడం, ఆయనను దర్శించడం నా మనసు మీద గాఢమైన ముద్ర వేసుకుంది.
ఇప్పటికీ… నేను తరచూ నా కలల్లో… తెలియని ప్రదేశాల్లో నాంపల్లి బాబా కోసం తపిస్తూ, వెతుకుతూ ఉంటాను. ఆయన ఆచూకీ చెప్పాలని నాకు తెలియని మనుషులను అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి మహా వృక్షాల నీడలో కూర్చొని ఆయన దర్శనం ఇస్తాడు. ఒక్కొక్కసారి నదుల దగ్గర, దేవాలయ ప్రాంగణాల్లో కనిపిస్తాడు. నేను ఉద్వేగంతో ఆయన ముందు నిలబడి ‘ఈయన నిజంగానే నాంపల్లి బాబానా, లేదంటే మరెవరైనానా?’ అనే తర్జనభర్జనలో పడిపోతాను. ఆయన దేనికీ జవాబు చెప్పడు. ఒక్కొక్కసారి గట్టిగా నవ్వుతాడు. ఒక్కోసారి మౌనంగా ఉంటాడు. ఆ సంఘటన జరిగి ముప్ఫై ఏళ్ళు గడిచిపోయినా… ఈ రోజుకు కూడా ఆ కల నాకు వస్తూనే ఉంది.
గౌలిపురా గతుకు వీధుల్ని వదిలి, మెయిన్ రోడ్డు మీదకు వచ్చాక… ఆటో సాఫీగా పరుగులెడుతోంది. తరువాత రెండు గంటలసేపు నేను రకరకాల సందేహాలతో మధనపడ్డాను. నా అంతరంగంలో చెలరేగుతున్న ఘర్షణ… ఆటోలోకి వస్తున్న చల్లటి రాత్రిగాలికి మెల్లగా సర్దుకుంటోంది.
‘ఒక విషయం మాత్రం ఖాయం… నాంపల్లి బాబా ఒక పిచ్చివాడు. అతని భక్తులు పిచ్చివాళ్ళు. బీనాదేవిని మళ్ళీ కలవను. కలిసినా, బాబాల గురించి ఆయనతో ఇక మాట్లాడను. బాబాను చూసేందుకు శ్రవణకుమార్ ఇంటికి ససేమిరా వెళ్ళను. ఈ పొరపాటు మళ్ళీ చెయ్యను. నా
విలువైన సమయాన్ని వృధా చెయ్యను’ అని శపధం చేసుకున్నాను. రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకొని, నిద్రపోయాను. తెల్లవారుజామున, మగత నిద్రలో.. నాంపల్లి బాబా కలలో కనబడ్డాడు. ఆయన షిరిడీ సాయిబాబాలా ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం చుట్టూ ఒక విద్యుద్దీపాల మాల వెలుగుతోంది. మగత నిద్రలో బుద్ధిపూర్వకంగా వచ్చే ఆలోచనలకూ, కలలకూ మధ్య బేధం ఉండదు. అందుకే ఆ కలను నేను ఏమాత్రం పట్టించుకోలేదు.
కొద్దిసేపు అయ్యాక లేచి, నా దైనందిన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మాక్స్‌ముల్లర్ భవనానికి వెళ్ళి, జర్మన్ క్లాసు మొదలుపెట్టాను. పాఠాలు చెప్పేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. కానీ ఆ రోజు నాకు ఏకాగ్రత కుదరలేదు. ఒక ఆలోచనను నేను ఎంత ప్రయత్నించినా నిరోధించలేకపోతున్నాను. అది కుక్కపిల్లలా మారాం చేస్తూ నన్ను వెంటాడుతోంది. నాకు నాంపల్లి బాబా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాడు. పాఠం పూర్తయ్యేసరికి ఎండ తీవ్రమయింది. నేను అణచుకోలేకపోతున్న ఒక ఆలోచన… కోరికగా మారింది – మళ్ళీ నాంపల్లిబాబా దర్శనం చేసుకోవాలని! నిజానికి అంతకన్నా మూర్ఖమైన కోరిక వేరే ఏదీ ఉండదని నాకు తెలుసు. నాంపల్లిబాబా నిస్సంశయంగా ఒక పిచ్చివాడు. ఆయన భక్తులు పిచ్చివాళ్ళు.
మరి ఆయనను మళ్ళీ ఎందుకు చూడాలనుకుంటున్నాను? నా వివేకాన్నంతటినీ ప్రయోగించినా… ఆ కోరికను నిర్మూలించలేకపోయాను. నాంపల్లి బాబాకు అదృశ్య శక్తులు ఉన్నాయో, లేవో నాకు తెలీదు. కానీ నాకొక విషయం తెలుసు. అదృశ్య శక్తులు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల మనకు సమస్యలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసుకుంటే… సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అది నా స్వానుభవం.
Click Here To Read Previous Articles about Sri Nampally Baba in Andhra Jyothy Paper / ఆంధ్రజ్యోతి పేపర్‌లో శ్రీ నాంపల్లి బాబా గురించి మునుపటి కథనాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి